"ఫ్రీ ఎనా?" అని అడిగింది సరోజ.
"ఆ.. దేనికి?" అని ఆవలిస్తూ బదులిచ్చాడు గోపి.
"రేపు ప్లేసుమెంట్లు కదా, జిరాక్స్ లు కొన్ని తీసుకోవాలి. రావొచ్చు గా?" అని ప్రేమ గా పిలిచింది సరోజ.
"ఆ జిరాక్స్లు అంటే గుర్తొచ్చింది. నాకూ కావలి. ఒక పది నిమిషాల్లో జిరాక్స్ షాప్ దగ్గర ఉంటాను. వచ్చేయ్" అంటూ చొక్కా ఏస్కోడం మొదలెట్టాడు గోపి.
గోపి జిరాక్స్ షాప్ దగ్గరికి సరిగ్గా పది నిమిషాల్లో వెళ్ళిపోయాడు. షాప్ దగ్గర పెద్ద లైన్ ఏ ఉంది. సరోజ కోసం ఎదురు చూస్తూ ఉంటె లైన్ ఇంకా పెరిగిపోతది అని లైన్ లో జేరిపోయాడు. ఐదు నిమిషాల తర్వాత కంగారు కంగారు గా వచ్చింది సరోజ.
"సారీ సారీ, లేట్ అయింది.... కోప్పడకు ఇప్పుడు" అంటూ గోపి ముందు లైన్ లో దూరిపోయింది. ఎనకున్న వాళ్ళు విసుక్కున్నా పట్టించుకోకుండా.
"నువ్వు టైం కి ఎప్పుడు వచ్చావ్ లే.." అన్నాడు గోపి వెటకారం గా. "మీకేంటి బాబు ఉత్తినే చొక్కా ఏస్కుని వచ్చేస్తారు.." అని సరోజ మాట అవ్వకముందే "...ఆ నువ్వు పట్టు చీర కట్టుకుని వచ్చావ్ మరి" అని గోపి చమత్కారం ఆడాడు. సరోజ మోచేయ్య తొ గోపి పొట్టలో ఒక గుద్దు గుద్దితే "అమ్మోఓ" అని శోకం పెట్టాడు. "నువ్వు నీ ఓవర్ యాక్షను" అని సరోజ గోపి చేసే అతి ని ఏ మాత్రం గుర్తించకుండా లైన్ ఎప్పుడు కదిలిద్దా అని చూస్తుంది.
లైన్ మెల్లిగా కదుల్తుంది. గోపి తన పేపర్స్ కనిపియ్యడం లేదని బాగ్ లో మొహం పెట్టేసి ఎతుక్కుంటున్నాడు. సరోజ పద్ధతి గా తన పేపర్స్ అన్ని ఒక L-ఫోల్డర్ నుంచి తీసి సద్దుకుంటుంది సరైన వరుస లో. అప్పుడే ఫోన్ వచ్చింది సరోజ కు. ఫోన్ ను చెవి కింద పెట్టుకుని మాట్లాడుతూ సద్దుకుంటుంది. ఈ సద్దుబాటుల్లో తన కుర్తా భుజం దగ్గర కొంచం జారీ తన బ్రా స్ట్రాప్ కనపడుతూ ఉంది.
గోపి తలకాయ ఇంకా తన బాగ్ లోనే ఉంది పేపర్లు ఎతుక్కుంటూ. వెనకాల ఉన్న అబ్బాయిలు ఎదో గుణగడం వినిపించి ఏంటా అని ఎనక్కి తిరిగితే వాళ్ళు గోపి ని చూసి ఆపేసారు. "ఎదో లే" అనుకుంటూ మల్లి బాగ్ లో పేపర్లు ఎతుక్కునే లోపల సరోజ బ్రా స్ట్రాప్ చూసాడు. సరోజ ని బ్రా సద్దుకోమని మెల్లిగా చెపుతుంటే ఫోన్ లో ఉండి ఆమె పట్టించుకోవట్లేదు. ఏం చేయాలో అర్ధం అవ్వట్లేదు గోపి కి. ఆ బ్రా ను అలా బహిరంగంగా చూడడం చాలా ఇబ్బంది గా ఉంది గోపి కి. ఇక గతి లేక తానే కుర్తా ని సద్దాడు, బ్రా స్ట్రాప్ కనిపియ్యకుండా. కొంచం ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది సరోజ "ఏంటి?" అని సైగ చేస్తూ. "ఏం లేదు ఏం లేదు.. ముందుకు కదులు " అని గోపి చేయ్యాడించాడు.
జిరాక్స్ ల పని అయిపోయింది. పక్కనే ఉన్న బేకారి దగ్గర ఇద్దరు ఎగ్గ్ పఫ్ లు తింటున్నారు. ఉన్నట్టు ఉండి సరోజ అడిగింది "ఇందాక నా భుజం దగ్గర కుర్తా ఎందుకు సద్దావు ?" అని
"ఆ.. ఏమి లేదు లే.. కొంచం పక్కకి జరిగింది అని.." అంటూ ఎగ్గ్ పఫ్ పోర లేపి మధ్యలో టమాటో సాస్ ఏసుకుంటున్నాడు గోపి
"పక్కకి జరిగింది అంటే? బ్రా స్ట్రాప్ కనిపించిందా?" అని సరోజ అడిగింది.
అలా జనాల మధ్య "బ్రా" అనే పదం వాడటం ఎదో పాపం అయినట్టు అటు ఇటు చూసాడు గోపి. ఎవరు వినలేదు కదా అని నిర్ధారించుకోడానికి.
"చెప్పు, నా బ్రా స్ట్రా... "అని సరోజ ఎదో అనే లోపలే "అబ్బా ఎందుకే అరుస్తున్నావు. అవును అది కనిపిస్తుంది అనే ఆలా చేశాను" అన్నాడు గోపి, సరోజ మూతి మూస్తూ.
గోపి చెయ్య పక్కకు తోసి, "ఆహా!.. కనిపియ్యకూడదు అనే అనుకున్నా, ఎవరికీ వినిపియ్యకూడదు కూడా అనమాట.. బ్రా", అని ఆ చివరి పదాన్ని గట్టిగా అరిసింది సరోజ
"ఇప్పుడేంటి నేను ఎదో తప్పు చేసినట్టు? ఇన్నర్ వేర్ కనిపియ్యకూడదు అనే గా ను దాని మీద కుర్తా ఏసుకుంది?" అని వాదించాడు గోపి.
"అవును నిజమే. మరి బనియన్లు కనపడేలా చొక్కా గుండీలు తీసేసి నువ్వు ఎందుకు తిరుగుతావు? నీ బనియన్లు కూడా ఇన్నర్ వేర్ ఏ కదా?" అని ఎదురు ప్రశ్న వేసింది సరోజ
"అలా కాదు సరోజ.. నీకు ఇష్టం లేదు అనుకున్నాను ఆలా కనిపియ్యడం" అని గోపి రాజి కొద్దాం లే ఇంకా అనుకుంటున్నాడు.
"నువ్వు నా ఇష్టాయిష్టాల గురించి అలోచించి నా కుర్తా సద్ది ఉంటే, అసలు ఈ ప్రశ్న అడిగే దానినే కాదు. నువ్వు పక్కన ఉన్న వాళ్ళ ఇష్టాయిష్టాలను పట్టించుకుని నా కుర్తా ని సద్దావు" అని సరోజ మందలించింది.
గోపి నోట మాట రాలేదు
మందలింపు ను కొనసాగిస్తూ
"అవును నాకూ ఇబ్బందే నా బ్రా స్ట్రాప్ కనిపియ్యడం. కానీ నువ్వు ఈరోజు నా కుర్తా ను సద్దినట్టు, రేపు పక్కింటోళ్లు గుణుగుతున్నారు అని నన్ను బట్టలు మార్చమంటావు. ఎదురింటోళ్లు గుణుగుతున్నారు అని ఉద్యోగాన్ని మార్చమంటావు. పపై ఇంటోళ్లు..."
"అబ్బా సరోజ... నేను ఎందుకే ఆలా చేస్తాను. ఎక్కువ సాగదీస్తున్నావు అనిపించట్లేదు నీకు ఈ విషయాన్నీ?"
"ఏమి అనిపించడం లేదు. ఎనకున్న వాళ్ళ గుణుగుడు కి నా కుర్తా సద్దావు గా. ఏవైనా చేస్తావు" అని మొహం వంకర తిప్పుకుంటూ అనింది సరోజ.
"నన్ను క్షమించు సరూ.. నిజంగా ఇంత ఆలోచించలేదు. ఈసారికి క్షమించేయ్. మల్లి ఇలా చేయను." అని దండం పెట్టాడు గోపి. దండం పెడ్తుంటే ఎగ్ పఫ్ పేపర్ ప్లేటు జారీ కింద పడిపోయింది. సరోజ సైగ చేస్తే దాన్ని తీసేసి చెత్త బుట్ట లో ఏసేసాడు.
"ఆహా.. మల్లి నా బ్రా స్ట్రాప్ కనిపిస్తే ఏం చేస్తావు? బురఖా కప్పేస్తావా ఈసారి?" అని వ్యంగ్యంగా అడిగింది సరోజ.
"లేదు. ఈసారి వెనక్కి తిరిగి.. 'మీ పనులు మీరు చూస్కోండ్రా'.. అని ఆ గొణుగుతున్న వాళ్ళ అంతు చూస్తా " అన్నాడు గోపి, చొక్కా మడుచుకుంటూ.
"మంచిది" అని తన పేపర్ ప్లేటు ను కూడా గోపి కి ఇచ్చేసింది సరోజ.
"కోపం పోయిందా? క్షమించేసావా?" అని బుజ్జగిస్తూ అడిగాడు గోపి.
"లేదు. నువ్వు చేసిన తప్పు కి ఒక శిక్ష ఉంది" అంటూ బేకారి లో డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చేసింది సరోజ
"ఏవిటో అది?" అని బుజం మీద చేతులు ఇస్తూ అడిగాడు గోపి
"నువ్వు ఒక్కడివే బట్టల కొట్టుకు వెళ్లి నాకు బ్రా కొని తీసుకుని రావాలి. అదే నీకు శిక్ష" అని సరోజ జడ్జి లాగా ఆర్డర్ జారీ చేసింది.
"సరూ .. సరూ .." అని ఎంత బతిమిలాడినా తగ్గలేదు ఆమె. ఇక చేసేది ఏమి లేక బట్టలు కొట్టు వైపు సిగ్గు పడుతూ వెళ్ళాడు గోపీ.