గోపి - లక్ష్మీ లేచిపోదామని ఫిక్స్ అయ్యారు. లేచిపోవడానికి ముహూర్తం లక్ష్మీ పెళ్లి రోజు. జనాలు వాళ్ళవాళ్ళ పనులలో బిజీగా ఉంటారు కాబట్టి ఈజీగా లేచిపోవచ్చు అని లక్ష్మీ గోపికి తన స్నేహితుల ద్వారా కబురు పంపింది. గోపి కూడా ఎలా లేచిపోవాలో చాలా ఆలోచించాడు.
పెళ్లి మండపం వెనుక ఆ ఊరి వాళ్ళు చెత్త వేస్తూ ఉంటారు. ఆ డంపింగ్ గ్రౌండు వెనుక Yamaha FZ తో రెడీగా ఉంటానని, పెళ్లి కూతురుని చీర మార్చుకోమని పంపినప్పుడు పారిపోదామని ప్లాన్ వేశాడు.
పెళ్లి రోజు వచ్చింది. సారీ, రాత్రి.
లక్ష్మీ ఎవరికీ అనుమానం రాకూడదని ఫోటోలు బాగా దిగింది. అత్త మామలకు వంగి వంగి దండాలు పెట్టింది. పెళ్లి కొడుకు చిలిపి వేషాలు వేస్తే హిహిహి అని సిగ్గు పడింది. ఇలా కొన్ని తంతులు అయ్యాకా పంతులు బట్టలు మార్చుకోమని పంపాడు లక్ష్మిని.
అనుకున్నట్టే వెనుక తలుపు నుంచి మండపం భయటకు వచ్చేసింది. గోడ దూకింది. చెత్తలో పడింది. అరటి తొక్కలు, మావిడి టెంకలు తన పెళ్లి చీరకు అంటుకున్నాయి. ఆ అరటి తొక్కలను దులిపేసుకుంది. లేచిపోతున్న ఆనందంతో మావిడి టెంకను గాల్లోకి విసిరింది. వెలుగు కోసం వెతికింది - Yamaha FZ headlights వెలుగు కోసం.
దూరంలో మిణుకుమంటున్న ధృవతార వలె గోపి Yamaha FZ తో కనిపించాడు - headlights ఆన్-ఆఫ్ చేస్తూ. గోపిని చూసి ఆగలేక పోయింది లక్ష్మీ. చీర పైకెత్తి పరిగెత్తుకుంటూ వెళ్ళింది ప్రియుడి వైపు. మరో ఐదు నిమిషాలు అలా పరిగెత్తి ఉంటే గోపితో లేచిపోయేది. కానీ తన పరుగుకు అంతరాయం కలిగింది - ఒక కుక్క.
***
ఎంచెక్కా రాత్రి భోజనం చేసి పడుకున్న ఒక చెత్త కుక్క మావిడి టెంక నెత్తి మీద పడి లేచింది. లేచి అటూ-ఇటూ చూస్తే ఎవరో తెల్ల చీర కట్టుకుని పరిగెత్తుతూ తన వైపు రావడం గమనించింది. కుక్కకు భయం వేసింది. అరిసింది.
భయపడుతున్న కుక్క — భయపడుతున్న లక్ష్మీ — మద్యలో చెత్త.
లక్ష్మీకి ఏం చేయాలో అర్ధం అవ్వలేదు. చెవి బుట్ట ఒకటి తీసి కుక్క మీదకు విసిరింది. కుక్క ఒక అడుగు ముందుకు వేసింది.
“గోపీ” అని అరిచింది లక్ష్మీ.
“Bowww” అని అరిచింది కుక్క.
డంపింగ్ గ్రౌండు భయట గోపి ఎదురుచూస్తున్నాడు.
“ఏంటి లక్ష్మీ ఇంకా రాలేదు?” అని గొణుగుతున్నాడు.
“హ్యాండ్ ఇచ్చింది ఏమో!” అని భయపడి మండపంలో ఉన్న ఫ్రెండుకి కాల్ చేశాడు.
“ఒరేయ్ , లక్ష్మీ అక్కడ ఉందా? ఇంకా రాలేదేమిటి? నేను వెయిటింగ్ ఇక్కడ!”
“ఒరేయ్ దుర్మార్గుడా! నీ అంతు చూస్తారా” అని గట్టి అరుపు వినిపించింది. లక్ష్మీ వాళ్ళ నాన్న! ఆల్రెడీ ఆ ఫ్రెండుని స్తంబానికి కట్టేసి కొట్టారు.
***
వెంటనే ఫోన్ పాడేసి Yamaha FZ బండిని డంపింగ్ గ్రౌండు లోకి తీసుకుని వెళ్ళాడు — “లక్ష్మీ లక్ష్మీ” అని అరుచుకుంటూ. లక్ష్మీ వాళ్ళ అన్న, నాన్న, ఇంక పంతులు కూడా చెత్త కుప్ప లోకి దూకారు. సగం నవిలిన చికెన్ బొక్క తగిలి పంతులు బోరుమని ఏడ్చాడు.
లక్ష్మీ వాళ్ళ అన్న, నాన్న “లక్ష్మీ, లక్ష్మీ” అని అరిచారు. కుక్క “Bow Bow” అని అరిచింది.
గోపికి లక్ష్మీ కనిపించింది. Yamaha FZ స్పీడు పెంచి దగ్గరకు వెళ్ళాడు. ఆ Yamaha FZ headlights వెలుగులో కుక్క నీడ సింహాంలా కనిపించింది. కుక్కను దాటుకుని వెళతుండగా బండిని వెంబడించింది కుక్క. ముందు రోజు ఓ Yamaha FZ దాని తోక తొక్కింది. వెంబడిస్తున్న కుక్కను చూసి లక్ష్మీని కూడా దాటుకుని వెళిపోయాడు గోపి.
“ఓరే గోపి! నన్నెకించుకోరా!” అని కుక్క వెనుక లక్ష్మీ కూడా పరిగెత్తింది.
ఒక పక్క లక్ష్మీ వాళ్ళ అన్న, నాన్న — ఒక పక్క కుక్క — మద్యలో గోపి. కుక్క వెనుక లక్ష్మీ.
***
స్పీడుగా వెళుతున్న బండి మీద రెండు కాళ్ళు పెట్టి, ఒక్క ఎగురు ఎగిరి, అలా బండిని లక్ష్మీ వాళ్ళ అన్న మీదకు తోలించాడు గోపి. కుక్క కూడా బండి వెనుక వెళ్ళింది. చెత్తలో పడ్డ గోపి దగ్గరకు లక్ష్మీ వెళ్ళి పైకి లేపింది. Hug చేసుకుంది. ముద్దు పెట్టింది.
“ఎంత తెగించావే!” అని అన్న అరిచాడు. Yamaha FZ వాడి కాలు మీద పడి ఉంది. వాడి మరొక కాలును కుక్క కరిచింది. లక్ష్మీ వాళ్ళ నాన్న కుక్కను “షు షు” అంటూ తరమడానికి ప్రయత్నించాడు.
అలా కుక్క మద్యలో ఉండగా, లక్ష్మీ చేయి పట్టుకుని పరిగెత్తాడు గోపి.
“అమ్మా! ఆగమ్మా!” అని లక్ష్మీ వాళ్ళ నాన్న అరిచాడు.
“సారీ నాన్నా!” అని లక్ష్మీ అరిచింది.
కుక్క “Bow Bow” అని అరిచింది.
తెలుగు భాషకి “లేచిపోవడం” అనే పదాన్ని పరిచయం చేసిన గుడిపాటి వెంకటచలం గారికి ఈ కథ అంకితం.
The story has a good pace to it. Keep writing more. Interesting to note that particular contribution of Chalam to Telugu vocab! :)
😂 chaala baaga raasaru , naaku nacchindi