ఫోన్ కింద పడింది.
గోపి గుండెలో పిడుగు పడింది.
తన class లో సరోజ ఆరోజే పైటేస్కుని వచ్చి రబ్బర్ మీద ఫోన్ నెంబర్ రాసి గోపికి ఇచ్చింది. సరోజకు ఫోన్ చేద్దాం అని నిద్రపోతున్న వాళ్ళ నాన్న దిండు కింద నుంచి ఫోన్ దొంగిలించాడు. ఇంట్లో మాట్లాడితే దొరికిపోతాడని terrace మీదకు అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళాడు.
ఒక మగ పిల్లి తన ప్రేయసిని కొరికి కొరికి ఆఖరుకి శృంగారానికి సిద్ధం చేసింది.
శృంగారం మొదలు అనగా గోపి సమయం కానీ సమయంలో Terrace డోరు తెరిచాడు. శృంగార భంగం. మగ పిల్లి తన కోరలు చూపిస్తూ “మిఅవ్” అని గాండ్రించింది. ప్రేయసి పిల్లి మూడ్ పోయి గోపి కాళ్ళ సందు నుంచి వెళిపోతుండగా గోపి తటేలున ఫోన్ విసిరేసాడు. ఆ ఫోన్ అంచు నెలకు తగిలి మూడు-నాలుగు సార్లు ఎగిరి మగ పిల్లి మొహం మీద గుద్దుకుంది. తోక ముడుచుకుని ప్రేయసిని మరల శృంగారానికి సిద్ధం చేయడానికి వెళ్ళిపోయింది.
ఫోన్ నేల మీద ఉంది.
చిలక్కొట్టిన్న apple కాయ సగానికి విరిగింది. వాళ్ళ నాన్న అలానే తన నడ్డి సగానికి విరగకొడతాడు అని అర్ధం అయింది. ఆ నొప్పులు భరించే కంటే బిల్డింగ్ మీద నుంచి దూకేయడం నయం అనిపించింది.
పిట్టగోడ ఎక్కాడు గోపి.
జీవితంలో ఇంత ఎత్తు ఎదుగుతాడని వాళ్ళమ్మ ఎప్పుడూ అనుకోలేదు.
కిందకు చుస్తే కళ్ళు తిరిగాయి గోపికి.
Superman పోజు లో నుంచుంటే ధైర్యం వస్తదని వాళ్ళ ఆటల మాస్టారు చెప్పిన మాట గుర్తొచ్చింది. నడుము మీద చేతులు వేస్కుని నుంచున్నాడు. పళ్ళు బిగపెట్టాడు. ఊపిరి గట్టిగ పీల్చుకున్నాడు- చివరి సారి అనుకుంటూ. అమాంతం గా దూకే …
“ముద్ద బంతి పూవులో మూగ బాసలు” అంటూ ఫోన్ మోగింది. తను తెచ్చుకున్న ధైర్యం అంతా ఆ రాత్రి చల్లటి గాలిలో చల్లారి పోయింది.
పిట్ట గోడ దిగాడు.
బిక్కు బిక్కు మంటూ ఫోన్ దగ్గరకు వెళ్ళాడు. వనుకుంటున్న చేతులతో ఫోన్ తీసుకున్నాడు. Screen పగిలిపోయి ఉంది. ఆ చల్ల గాలి కూడా తన చెమటను ఆపలేక పోయింది. భూకంపం వస్తే బాగుండు అనుకున్నాడు. వాళ్ళమ్మకు పక్షవాతం వస్తే బాగుండు అనుకున్నాడు. ఫోన్ వెతుకుతూ వాళ్ళమ్మ చేసిందేమో అని అనుకుంటూ చివరి మాట చెపుదాం అనుకున్నాడు.
ఫోన్ ఎత్తాడు.
నిశ్శబ్దం.
పక్షుల కూకూలు వినిపించాయి.
నిశ్శబ్దం.
కింద ఇంట్లో కొడుకుని చిటబడటం వినిపించింది.
నిశ్శబ్దం.
పిల్లుల శృంగార కేకలు వినిపించాయి.
నిశ్శబ్దం.
ఆ నిశ్శబ్దాన్ని బద్దలకొట్టుకుంటూ ఒక గుసగుసలాడే ప్రశ్న వినిపించింది గోపికి. “గోపి ఆ?” అని ఆ చల్ల గాలే మాట్లాడినట్టు అనిపించింది గోపికి. తన చెమట ఆవిరైపోయింది. ఊపిరి తిరిగొచ్చింది. పిల్లి
“సరోజ!” అంటూ కంఠం నుంచి గాలి తన్నుకుంటూ బయటకొచ్చింది తన ప్రమేయం లేకుండానే.
“కాదు రా! నీ అమ్మ!” అని ఒక ఉరుము వినిపించింది. ఫోన్ మల్లి తటేలున వెళ్లి మగ పిల్లి నెత్తికి తగిలితే అది రెండు పల్టీలు కొట్టి మరణించింది. ప్రేయసి పిల్లి వర్షంలో విరహ గీతం పాడింది.
ఆ రాత్రి గోపి మీద వడగళ్ల తిట్లు కురిశాయి. పిడుగులాంటి దెబ్బలు పడ్డాయి.
పిల్లిను చంపిన పాపం ఏడు జన్మలకు పోదని పురోహితుడు శాస్త్రం చెప్పాడు. బంగారు పిల్లిని దానం ఇచ్చి దోష నివారణకు మార్గం చెప్పాడు. అది ఆస్తి నివారణ అనిపించింది గోపి తండ్రికి. కావాలంటే పిల్లిను చంపిన ఆయుధాన్ని దానం చేస్తా అన్నాడు. ఆ విరిగిన ఫోన్ ను చూసి శపించి వెళ్ళిపోయాడు పురోహితుడు. తన కొడుకు నిరుపేద అవ్వడం కంటే పాపిష్టోడు అవ్వడమే నయం అని ఊరుకున్నాడు తండ్రి. తండ్రి కొత్త ఫోన్ కొనుక్కుని, ఇరిగిన ఫోన్ గోపికి ఇచ్చేసాడు.
చావు వార్త వినగానే పక్క బిల్డింగ్ నుంచి Terrace మీదకు కొత్త మగ పిల్లి దూకింది. కానీ వాళ్లకు ఏకాంతం లేదు. గోపి మళ్ళీ terrace మీదకు వెళ్ళాడు. ఇరువురు ఎదురయ్యారు. వాళ్ళమ్మ గోపికిచ్చిన పాల గ్లాసును ఒక మూల పెట్టి సారీ చెప్పాడు గోపి. పిల్లులు రెండు పాలు తాగి శోభనం చేసుకున్నాయి. గోపి సరోజ తో ఫోన్ లో అచ్చిక బుచ్చికలాడాడు.



