Wrote this at Hyderabad Write Club for the prompt: Into the Wilderness
అది మనుషుల జనాభా అమాంతం పడిపోయిన కాలం. కాలుష్యం, వాతావరణ మార్పు వలన; DINK లాంటి కొత్త ఒరవడ్లు వలన మానవ జనాభా లక్షల్లోకి పడిపోయింది. ఈ లక్షల్లో స్త్రీల జనాభా కేవలం వందలకి పడిపోయింది. మానవత్వం ఎప్పుడో అంతరించిపోయింది. మానవులు కూడా అంతరించకుండా ఉండాలి అంటే ఒక్కటే మార్గం — పిల్లలను కనాలి.
లక్షల్లో కనాలి.
అప్పుడు కానీ వేలల్లో బ్రతకరు. చాలా మంది పిల్లలు ఆ కాలపు వాతావరణాన్ని రెండేళ్లను మించి భరించలేక చనిపోతున్నారు.
ఒక ఆడ-మగ జంట జతకట్టి పిల్లలు కంటే — మహా అయితే ఇద్దరు పిల్లల్నే కనగలుగుతారు కదా. అలా అయితే మానవ జనాభాను పూర్వ వైభవానికి తీసుకురావడం కష్టం. అందువల్ల పందులలా ఒకే కాన్పులో పది పిల్లలు పుట్టాలి అని పరిశోధన చేశారు కొందరు శాస్త్రవేత్తలు. ఆ పరిశోదనలో పాల్గొన్న ఆడవాళ్ళు అందరూ చనిపోయారు. కొత్త మార్గాలు వెతకడం మొదలు పెట్టారు.
ఒక మెరైన్ బయాలజిస్టుకు (marine biologist) ఒక ఉపాయం తోచింది. క్షీరదాలా (Mammals) అంతర్గత ఫలదీకరణం (internal fertilisation) జరిగితే రెండు పిల్లలను మించి కష్టమనీ, బాహ్య ఫలదీకరణం (external fertilisation) జరిగితే ఎంత మందినైనా కనవచ్చుననీ ఆమెకు తోచింది. ఆడవాళ్ళతో చేపలలా గుడ్లు పెట్టించి, ఆ గుడ్లను మగవాళ్లు ఫలదీకరించే మార్గం కనుగొన్నది. దీనితో ఆడవాళ్లకు కాన్పు అప్పుడు పడవల్సిన శారీరిక-మానసిక శ్రమ కూడా తగ్గుతుంది అని ఆమె విశ్వాసం. మానవ జాతిని సంరక్షించే ఈ పరిశోదన కొరకు ఆమెకు నోబెల్ బహుమానం కూడా వచ్చింది.
జెనెటిక్ ఇంజనీరింగ్ (Genetic Engineering) ద్వారా ఉన్న ఆడవాళ్ళందరిలో ఈ గుడ్లు పెట్టె మార్పు తీసుకొచ్చారు. ఇక ప్రతి నెలా ఆడవాళ్ళు గుడ్లు పెట్టడం మొదలు పెట్టారు. ఒక్క అమ్మాయి నెలకి సగటున 100 గుడ్లు పెడుతుంది.
నెలసరి రక్తంతో కలిసిన ఈ గుడ్ల దగ్గరకు వెళ్ళడానికి మొదట్లో మగవాళ్ళు సంకోచించారు. కానీ జాతి అంతం ముందు ఛాందసం ఎక్కువ రోజులు నిలువలేదు. నెమ్మదిగా గుడ్లను తమ శుక్రముతో ఫలదీకరించడం మొదలు పెట్టారు మగవాళ్ళు.
కానీ ఎన్నని ఫలదీకరించగలరు పాపం? అనేక ఒత్తిడులు ఎక్కువ అవడం చేత వంధ్యత్వం (infertility) పెరిగిపోయింది మగవాళ్ళలో. కొంత మంది మగవాళ్ళలోనే ఈ ఫలదీకరించే నైపుణ్యం మిగిలుంది. వారిలో కూడా శుక్రం మోతాదు వేపచెట్టులో తేనె చెమ్మ అంత తక్కువ అయిపోయింది . మహా అయితే రోజుకు రెండు సార్లు తమ శక్తిని చూపించగలరు. అందువలన ఫలదీకరణం అవ్వని గుడ్ల సంఖ్య పెరిపోయింది. ఆమ్లెట్లు ఏస్కోడానికి తప్ప దేనికి పనికి రాకుండా పోతున్నాయి.
ప్రధాన మంత్రికి కంగారు పట్టుకుంది.
మానవ జాతి అంతం మీద యుద్దం ప్రకటించారు.
ప్రపంచంలోని సారవంతమైన మగవాళ్లను నిర్భందించి, ఈ యుద్దంలో సైనికులను చేశారు. ఒక్కో సైనికుడు రోజుకు కనీసం పది గుడ్లను ఫలదీకరించాలి అని నియమం పెట్టారు. ఈ యుద్దంలో ఏంతో మంది సైనికులు ఆవిరైపోయారు.
కానీ ఆడవాళ్ళు మాత్రం చాలా సుఖపడ్డారు. కాన్పు అప్పుడు పడవలసిన శ్రమ లేదు. కాన్పు వలన ఉద్యోగాలకి సెలవు పెట్టాల్సిన అవసరం లేదు. కాన్పు అప్పుడు మగవాళ్ళ మీద ఆదారపడవాల్సిన అవసరం లేదు.
కానీ ఇది తాత్కాలిక ఆనందం మాత్రమే అని కొందరు ఆడవాళ్ళు అభిప్రాయపడ్డారు. జనాభా పెరిగిపోయి, మళ్ళీ మునుపులా పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ ఏర్పాటైతే తమ స్వాతంత్రం పోతుంది అని భయపడ్డారు.
ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక ఉపాయం ఆలోచించారు.
పుట్టిన పిల్లలకు తండ్రి ఎవరో తెలియకుండా ఉండేలా ఒక సామూహిక జీవనం ఏర్పాటు చేసుకుందాం అని నిర్ణయించుకున్నారు. అప్పట్నుంచి వాళ్ళు వాళ్ళ గుడ్లను మగవాళ్లకు ఇవ్వడం మానేశారు.
గుడ్లను ఒక నీటి బావిలో దాచి, వాళ్ళకు నచ్చిన మగవాళ్లను గుంపుగా ఆ బావి లోపల స్ఖలించేలా ప్రోత్సాహించారు. ఆ మగవాళ్ళ శుక్రం ఆ బావి నీటిలో కలిసి, గుడ్లను ఫలదీకరిస్తాయి. ఏ గుడ్డు ఎవరు ఫలదీకరించారో తెలియదు. పుట్టిన పిల్లల తండ్రులు ఎవరో ఎవరికీ తెలియదు. కేవలం తల్లి మాత్రమే తెలుసు. అందువల్ల వారి పేర్ల చివర తల్లి పేరు మాత్రమే ఉండడం ఆనవాయితీ అయింది.
ఇలా స్త్రీలు మాతృస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసుకుని హాయిగా బ్రతికారు. ఈ కొత్త సమాజంలో అనవసరపు ఒత్తిడులు తగ్గడం వలన నెమ్మదిగా మగవాళ్ళలో శుక్రం మోతాదు కూడా బాగా పెరిగింది. జనాభా పెరిగింది. మానవ జాతి పూర్వ వైభవం — కాదు కొత్త వైభవం అందుకుంది.


