గొపి మళ్ళీ మాధవ్ ఇంటికి వెళ్ళాడు. ఈ ఏడాదిలో అయిదవ సారి వెళ్లడం. ఎప్పటిలానే హాలులో సొఫా మీద దిగాలుగా కూర్చొని, టెబుల్ మీద కడవ బరువుకు వంగిన నడుముతో ఉన్న ఒక మట్టి అమ్మాయి బొమ్మతో ఆడుకున్నాడు. మాధవ్ కి విషయం అర్థమైయ్యి కుర్చి లాగి గొపికి ఎదురుగా కూర్చున్నాడు
“ఎన్ని సార్లు బ్రేక్అప్ చెప్తావు రా!” మాధవ్ కసిరాడు.
తల దించుకుని మౌనంగా కూర్చున్నాడు గోపి. ఈ ఏడాదిలో అయిదవ బ్రేక్అప్ ఇది. దాదాపు ప్రతీ నెల బ్రేక్అప్ చేయడం, మాధవ్ దగ్గరకు వెళ్లడం, కుయ్యోమని ఏడవడం. ఇదో అలవాటు అయిపోయింది గోపికి. టెబుల్ మీదున్న అమ్మాయి బొమ్మ చేతి నుంచి కడవ తీసి తల మీద పెట్టాడు. బొమ్మ చేతిని కూడా బుజం దగ్గర తిప్పి తలమీద ఉన్న కడవ పడిపోకుండా పెట్టాడు. నడుము ఇంకా వంగే ఉంది.
“గోపి! నీ సమస్య ఏంటో చెప్తే నేను పరిష్కారం చెప్తాను కదా!” అంటూ గోపి పక్కన కూర్చోని బుజం మీద చెయ్యి వేసి అడిగాడు మాధవ్.
“నాకు ఎవరు నచ్చడం లేదురా”, తల ఎత్తకుండా, బొమ్మ నడుమును సరిచేస్తూ అన్నాడు గొపి.
అవును నిజంగానే గోపికి ఎవరు నచ్చడం లేదు. అందరిలో ఏదో ఒక లోపం చూపించి బ్రేక్అప్ చెప్పేశాడు. ఒక అమ్మాయి లొడలొడ వాగుతూనే ఉంటది “not a good listener” అని చెప్పి బ్రేక్అప్ చెప్పాడు. ఉంకో అమ్మాయి అసలు మాట్లాడట్లేదు “too boring” అని చెప్పి బ్రేక్అప్ చెప్పాడు. అమ్మాయి బొమ్మ నడుము సరైంది కానీ బొడ్డు మధ్యలోకి లేదు. ఆ బొడ్డును పూడ్చి, సరిగ్గా నడుము మధ్యలో మరొక బొడ్డు పెట్టాడు.
“నీకు అసలు ఎలాంటి అమ్మాయి కావాలి రా? నీకు క్లారిటి ఉందా?”
బొమ్మను పక్కన పెట్టేసి, “నాకు నాలాంటి అమ్మాయి కావాలి రా” అని చెప్పాడు గోపి తడుముకోకుండా.
“అంటే?”
“అంటే… నా లాగా… నాలా ఆలోచించే అమ్మాయి. నా ఇష్టాఅయిష్టాలు పంచుకోవాలి.. సినిమాలు..షికార్లులో భేదాభిప్రాయం కూడదు,” అంటూ పెద్ద లిస్టే చెప్పాడు గోపి.
మాధవ్ కాసేపు ధీర్ఘంగా ఆలోచనల్లో పడ్డాడు. గోపి మళ్లీ బొమ్మ నడుమును నాజూకుగా చెక్కడం మొదలెట్టాడు.
“మార్కెట్ కి వెళ్లి శెనగ పిండి తే.” ఆలోచన ముగించి ఆర్డర్ వేశాడు మాధవ్.
“ఏ! నేను dieting చేస్తున్నాను రా!” పొట్ట మీద చెయ్యి వేసి అన్నాడు గోపి.
“నీకు బజ్జీలు వెయ్యడానికి కాదు బాబ్జి… వెళ్ళి తే చెప్తా”
“సరే!” అని గోపి లేచాడు.
“అరవై కిలోలు”
“ఒరేయ్! అంతెందుకురా!”
“నువ్వు తేరా!”
కొద్ది సేపట్లో అరవై కిలోలు శెనగ పిండితో గోపి తిరిగి వచ్చాడు. గోపిని సోఫా మీద కూర్చోపెట్టి, శెనగ పిండి మెత్తాన్ని పెద్ద గిన్నెలో వేశాడు మాధవ్. గోపికి ఏమి అర్థం అవ్వడం లేదని మోహంలో స్పష్టంగా తెలిసింది.
“ఇప్పుడు నీకొకటి చూపిస్తా.. నువ్వు భయపడకూడదు”
“ఏంటి రా!”
ఒక చిరునవ్వు నవ్వాడు మాధవ్. కళ్లు మూసి పార్వతి దేవిని స్మరించి ఒక శ్లోకం పాడాడు. టేబుల్ మీదున్న అమ్మాయి బొమ్మ కడవతో పాటు నడుము తిప్పుకుంటూ వెళ్ళి శెనగ పిండి గిన్నెలోకి దూకింది. అది చూసి గోపి నోరు పాదింతలయింది.
“ఎడమ చేయి చూపీ” అని మాధవ్ అడిగాడు. నోరప్పగించే చేయెత్తాడు గోపి. Gillette Blade తో చిటికెన వేలు చర్మం వళిచి శెనగ పిండిలో రక్తాన్ని కలిపాడు మాధవ్. గోపి కుయ్యోమని అరిచి వేలు నోట్లో పెట్టుకున్నాడు.
శెనగ పిండి అంతా ఒక అమ్మాయి విగ్రహంలా తయారయ్యింది. నూనె లేకుండానే ఎర్రగా అయింది. బంగారపు ఛాయ. పొడవాటి జుట్టు. నాజూకు నడుము. మధ్యలో బొడ్డు.
“ఇదుగోరా గోపి. నీ లాంటి అమ్మాయి. ఇంటికి తీస్కుని వెళ్ళి సుఖంగా ఉండండి. నన్ను ఇక దొబ్బకు.” అని చివరి మంత్రం పాడేశాడు మాధవ్. గోపిని చూసి కన్ను కొట్టింది విగ్రహం. గోపి సిగ్గు పడ్డాడు.
నిజంగా తన లాంటి అమ్మాయేనా టెస్టు చేద్దాం అని, “నీ favorite hero ఎవరు?”, అని గోపి అడిగాడు. “బాలకృష్ణ” అంటూ అమ్మాయి సిగ్గు పడింది. గోపి కళ్ళు పదింతలయ్యాయి.
“మాధవూ! ఇలా ఎలా చేశావు రా! Thanks రా!” అని మాధవ్ ను కౌగిలించుకున్నాడు గోపి.
“ఆ ఆ.. పేరు ఏం పెడతావో పెట్టి ఇంటికి తీసుకుని పో”
బాగా ఆలోచించి, “స-రో-జ”, అన్నాడు గోపి.
***
మరుసటి వారం:
గొపి మాధవ్ ఇంటికి వెళ్ళాడు. “ఈడేంటి మళ్ళీ వచ్చాడు”, అని అనుకుని, “ఏంటిరా! నీలాంటి పిల్లలు కూడా కావాలా?” అని మాధవ్ వెటకారంగా అడిగాడు. గోపి హాలులో సొఫా మీద దిగాలుగా కూర్చున్నాడు. మాధవ్ కి మనసులో పిడుగు పడ్డట్టు అయింది.
“మళ్ళీ ఏమయిందిరా!”
“బ్రేక్అప్”
“ఏ! నీలాంటి అమ్మాయేగా!”
“ఈసారి అమ్మాయే బ్రేక్అప్ చెప్పిందిరా!” అన్నాడు గోపి తల దించుకుంటూ.
“ఏంటి!?”
“రాత్రుల్లు గురక పెడుతున్నానట. మాట్లాడే అప్పుడు ఫోను ఎక్కువ చూస్తున్నానట. పంక్చువాలిటి లేదట. ఇలా ఎవెవో చప్పి బ్రేక్అప్ చెప్పిందిరా” అంటూ గోపి ఏడుపు మొదలు పెట్టాడు. మాధవ్ బుజం మీద చేతులేసి ఓదార్చాడు.
“దీని బట్టి నీకేమర్ధమైంది రా గోపి?”
గోపి మౌనంగా ఏడవసాగాడు.
“నీకు నువ్వే నచ్చవురా గోపి. ఇంక వేరే వాళ్ళు ఏం నచ్చుతారు? ఇప్పటికైనా వెరే వాళ్ళలో లోపాలు చూడడం ఆపి, నిన్ను నువ్వు సరిదిద్దుకో!” అని మాధవ్ హితోపదేశం చేశాడు.
సరే అన్నట్టుగా తలాడించాడు గోపి.

